PIL moves to high court against Eenadu,Andhrajyothi paper
PIL moves to high court against Eenadu,Andhrajyothi paper
ప్పుడు కథనాలు ప్రచురించకుండా ఆదేశించండి
సీబీఐ దర్యాప్తును ప్రభావితం చేసేలా కథనాలు
సీబీఐ అధికారులు ఆ రెండు పత్రికలకు
సమాచారాన్ని లీక్ చేస్తున్నారు
హైదరాబాద్, న్యూస్‌లైన్: ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారంలో సీబీఐ చేస్తున్న దర్యాప్తును ప్రభావితం చేసే విధంగా.. సాక్షులను భయాందోళనలకు గురి చేసేలా తప్పుడు కథనాలను ప్రచురించకుండా ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలను ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పరిశోధనాత్మక జర్నలిజం పేరుతో సాక్షుల వాంగ్మూలాలంటూ దర్యాప్తును తప్పుదోవ పట్టించే కథనాలను ప్రచురించకుండా ఈ రెండు పత్రికలను ఆదేశించాలంటూ రాజ్యసభ సభ్యుడు కె.వి.పి.రామచంద్రరావు వియ్యంకుడు కె.రఘురామకృష్ణరాజు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందులో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సీబీఐ డెరైక్టర్, సీబీఐ జాయింట్ డెరైక్టర్, ఆమోద పబ్లికేషన్స్ ఎండీ, ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్ ఎండీ, ఎమ్మార్‌హిల్స్ టౌన్‌షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఈహెచ్‌టీపీఎల్)లను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఎమ్మార్ వద్ద ప్లాట్లు కొనుగోలు చేసిన వారి పట్ల ప్రజలు ద్వేషభావం పెంచుకునేలా చేసేందుకు సీబీఐ జాయింట్ డెరైక్టర్, అతని సహచరులు తమకు తెలిసిన విషయాలను, దర్యాప్తునకు సంబంధించి అతి సున్నితమైన అంశాలను ఎంపిక చేసుకున్న విధంగా ఈనాడు, ఆంధ్రజ్యోతిలకు చేరవేస్తున్నారని ఆయన తన పిటిషన్‌లో ఆరోపించారు. తద్వారా చట్టబద్ధమైన తనలాంటి కొనుగోలుదారులను నేరస్తులుగా చిత్రీకరించేందుకు సీబీఐ ప్రయత్నిస్తోందని వివరించారు. ఇది తమ ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమే అవుతుందని పేర్కొన్నారు.
లీకేజీలపై సిట్టింగ్ జడ్జితో దర్యాప్తునకు ఆదేశించండి...
ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు సాక్షుల తాలూకు వాంగ్మూలాలు, ప్రకటనలు, నేరాంగీకారాలు తదితర అంశాలను యథాతథంగా ప్రచురిస్తున్నాయని రామకృష్ణరాజు తన పిటిషన్‌లో అభ్యంతరం వ్యక్తంచేశారు. ‘‘ఆ రెండు పత్రికలు ఇలా చేయడం వెనుక ఏకైక లక్ష్యం సీబీఐ దర్యాప్తును ప్రభావితం చేయడమే. సాక్షుల్లో భయాందోళనలు కలిగించి, ప్లాట్లు కొనుగోలు చేసిన వారిని అప్రతిష్ట పాలు చేయడానికే ఈ రెండు పత్రికలు అటువంటి కథనాలను ప్రచురిస్తున్నాయి. ఈ కథనాలు కోర్టు ధిక్కారం కిందకు కూడా వస్తాయి. సీబీఐ ఉద్దేశపూర్వకంగా చేస్తున్న వరుస లీకేజీలపై హైకోర్టు సిట్టింగ్ లేదా రిటైర్డ్ న్యాయమూర్తితో దర్యాప్తు చేయించాలి. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, దర్యాప్తునకు సంబంధించి ఏ అంశాన్నీ కూడా ఈనాడు, ఆంధ్రజ్యోతిలకు బహిర్గతం చేయకుండా సీబీఐని ఆదేశించాలి. ఎమ్మార్‌పై సాగుతున్న దర్యాప్తుకు స్థానిక రాజకీయ అంశాలను జోడించి ఈ రెండు పత్రికలు కథనాలు ప్రచురిస్తున్నాయి.
తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల యాజమాన్యాలు జర్నలిజం విలువలను కాలరాసి, అనైతిక చర్యలకు పాల్పడుతున్నాయి. తప్పుడు కథనాలతో సంచలనం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ రెండు పత్రికల్లో వార్తలు తక్కువ.. అభిప్రాయాలు ఎక్కువగా ఉంటున్నాయి. కోనేరు ప్రసాద్ అరెస్ట్ జరిగిన నాటి నుంచి ఈ పత్రికలు ఎటువంటి నియంత్రణ లేకుండా, దర్యాప్తును ప్రభావితం చేసే విధంగా కథనాలు ప్రచురిస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రజ్యోతి పత్రిక సీబీఐ జాయింట్ డెరైక్టర్‌ను కీర్తిస్తూ ప్రత్యేక కథనం ప్రచురించింది. జాయింట్ డెరైక్టర్ నుంచి సమాచారం పొందేందుకు వీలవుతుందనే ఉద్దేశంతోనే ఆయనకు అనుకూలంగా కథనం ప్రచురించింది’’ అని వివరించారు.
సీబీఐ అధికారులు ఒక్కసారి కూడా ఖండించలేదు...
దర్యాప్తుకు సంబంధించి వాస్తవాలను ప్రచురించడం పట్ల నాకు ఎటువంటి అభ్యంతరం లేదని రామకృష్ణరాజు తన పిటిషన్‌లో స్పష్టంచేశారు. అయితే ఈనాడు, ఆంధ్రజ్యోతి సాక్షులు చెప్పని విషయాలను చెప్పినట్లు ప్రచురించి, పాఠకులు అవే నిజమైనవని భావించే విధంగా చేస్తున్నాయని పేర్కొన్నారు. ‘‘ఆ రెండు పత్రికలు ఇప్పటివరకు ప్రచురించిన తప్పుడు కథనాలను సీబీఐ అధికారులు ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఖండించలేదు. అవి ప్రచురించే కథనాలను చదివే ప్రతి సామాన్యుడు కూడా ఎమ్మార్‌లో ప్లాటు కొనుగోలు చేసిన వ్యక్తులను నేరస్తులుగా భావించేందుకు అవకాశం ఉంది. ఎమ్మార్‌లో ప్లాట్‌ను నేను చట్టబద్ధంగా కొనుగోలు చేశాను. ఎమ్మార్‌కు ప్రభుత్వానికి జరిగిన ఒప్పందాల్లో, ఇతర లావాదేవీల్లో నాకు ఎటువంటి సంబంధం లేదు. కానీ మీడియా చేస్తున్న విచారణ వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇటువంటి పత్రికలు చేసే సూడో విచారణ విషయంలో ప్రేక్షకపాత్ర పోషించడం సరికాదు. సీబీఐ చేస్తున్న దర్యాప్తు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. అలాంటప్పుడు ఇష్టారాజ్యంగా కథనాలను ఎలా ప్రచురిస్తారు. సాక్షులను కూడా ఆ రెండు పత్రికలు నేరస్తులుగా చిత్రీకరిస్తున్నాయి. కాబట్టి సీబీఐ చేస్తున్న ఉద్దేశపూర్వక లీకులపై సిట్టింగ్ జడ్జి లేదా రిటైర్డ్ న్యాయమూర్తితో దర్యాప్తు చేయించాలి. దర్యాప్తులో తమకు లభించిన సమాచారాన్ని రహస్యంగా ఉంచాల్సిన బాధ్యత సీబీఐపై ఉంది. సాక్షులు వాంగ్మూలాలు ఇచ్చేది వాటిని బహిర్గతం చేసేందుకు కాదు. సీబీఐ లీకుల వల్ల నావంటి వ్యక్తుల ప్రతిష్టకు తీరని నష్టం కలుగుతోంది’’ అని పిటిషనర్ తన వ్యాజ్యంలో పేర్కొన్నారు.