Thursday, December 15, 2011

CM Kiran Vs Ministers in collector meetings

CM Kiran Vs Ministers in collector meetings                                 

జిల్లా కలెక్టర్ల సమావేశం వేదికగా ముఖ్యమంత్రిపై మాటలదాడి
సీఎం వ్యవహారశైలి, విధానాలను పరోక్షంగా దుయ్యబట్టిన మంత్రులు.. బిత్తరపోయిన అధికారులు
లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు సరే.. కాంట్రాక్టు ఉద్యోగాల సంగతే మిటని ప్రశ్నించిన జానా
విద్యుత్ సమస్య తీవ్రంగా ఉంది.. గట్టెక్కడానికి ఏం చేస్తున్నారు అంటూ జానా ప్రశ్న
ఇందిరమ్మ ఇళ్లకు బిల్లుల్లేవు, ఎస్సీ, ఎస్టీ ఇళ్ల నిర్మాణం ఆగిపోయిందంటూ మంత్రుల విసుర్లు

ప్రభుత్వ శాఖల్లో లక్ష ఉద్యోగాలు ఇస్తానంటున్నారు. అదెలా సాధ్యం? అంటే.. ఇప్పటికే కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ కింద పనిచేస్తున్న ఉద్యోగులను తొలగిస్తారా?

*రోజూ ఇళ్లల్లో కరెంటు పది సార్లు వచ్చిపోతోంది. ఈ సమస్య తీవ్రంగా ఉంది? దీని నుంచి గట్టెక్కడానికి ఏం చేస్తున్నారు?

*ఇందిరమ్మ ఇళ్లకు బిల్లులు మంజూరు చేయడం లేదు. రెండేళ్ల నుంచీ ఎస్సీ, ఎస్టీల ఇళ్ల నిర్మాణం ఆగిపోయింది. వాటి సంగతేంటి?

*వికలాంగులకు పింఛన్లు మంజూరు చేయకుండా తిప్పించుకుంటున్నారు. వారికి పెన్షన్లు ఇస్తారా? ఇవ్వరా?

*మధ్యాహ్న భోజనంపై తప్పుడు లెక్కలు చూపించి నిధులు మింగుతున్నారు. ఇదేం అన్యాయం?

ఇవి ప్రభుత్వంపై విపక్షాలు కురిపిస్తున్న విమర్శనాస్త్రాలు కావు. స్వయంగా ప్రభుత్వంలోని మంత్రులే తమ ప్రభుత్వ విధానాలపైనే ఇలా బాహాటంగా దుమ్మెత్తిపోశారు. తద్వారా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యవహారశైలిని, విధానాలను పరోక్షంగా దుయ్యబట్టారు. బుధవారమిక్కడ జూబ్లీహాలులో ప్రారంభమైన జిల్లా కలెక్టర్ల రెండ్రోజుల సమావేశం ఈ సన్నివేశాలకు వేదికైంది. దాదాపు రెండేళ్ల తర్వాత జరుగుతున్న ఈ భేటీలో జిల్లాల్లోని సమస్యలను కలెక్టర్లు ఏకరువు పెట్టాల్సి ఉండగా.. ఆ బాధ్యతను మంత్రులే తీసుకున్నారు. మంత్రివర్గ సమావే శాల్లో ప్రభుత్వ విధానాలపై మాట్లాడుకోవాల్సిన అమాత్యులు.. ఈ సదస్సులో నేరుగా వాటిపైనే విమర్శలు గుప్పించడంతో అధికారులు బిత్తరపోయారు. పైగా.. కలెక్టర్లకు ఏమాత్రం సంబంధం లేని కరెంటు కోత విషయంలోనూ వారినే ప్రశ్నించారు.

ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన పథకాలు, వాటి అమలు, ఇప్పటికే కొనసాగుతున్న పథకాల అమలులో ప్రభుత్వ వైఫల్యాన్ని మంత్రులే ఎండగట్టారు. విద్యుత్ సరఫరా, ఇందిరమ్మ ఇళ్లకు బిల్లులు, తాగునీటి సరఫరా, రేషన్ కార్డులు, పింఛన్లు, నీటిపారుదల ప్రాజెక్టులు, కరువు, వ్యవసాయం, లక్ష ఉద్యోగాలు వంటి అంశాలపై ముఖ్యమంత్రి సమక్షంలో అమాత్యులు ప్రశ్నలు సంధించారు. ఇబ్బందులను ఏకరువు పెట్టారు. సమావేశాల తొలిరోజునే సీనియర్ మంత్రులు ప్రభుత్వ పథకాల అమలుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ.. ముఖ్యమంత్రినే టార్గెట్ చేశారు. ఈ నేపథ్యంలో దీనిని జిల్లా కలెక్టర్ల సమావేశం అనడం కంటే మంత్రివర్గ సమావేశం అంటే బాగుంటుందని సీనియర్ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి వ్యాఖ్యానించడం గమనార్హం.

లక్ష ఉద్యోగాల ప్రకటనపై జానా సందేహం..

ముఖ్యమంత్రి లక్ష ఉద్యోగాల ప్రకటనపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానారెడ్డి సందేహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యుత్ సరఫరా అంశాలపై కిరణ్‌ను నిలదీశారు. ‘ప్రభుత్వ శాఖల్లో లక్షకు పైగా కొత్త ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం బాగానే ఉంది. మరి ఇప్పటికే కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పేరుతో ఏళ్ల తరబడి పని చేస్తున్న వేలాది మంది సంగతేమిటి? వారిని తొలగించి కొత్త ఉద్యోగాలను భర్తీ చేస్తారా? వారిని అలాగే కొనసాగిస్తూ కొత్త ఉద్యోగాలు ఇస్తారా? ఉద్యోగాలు భర్తీ చేసే సమయంలో వీరికేమైనా ప్రాధాన్యత కల్పిస్తారా? ఒకవేళ కాకపోతే వారి భవిష్యత్ ఏమిటి? నా శాఖలోనే దాదాపు ఏడు వేల మంది కార్యదర్శులు కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారు. మరి వారి సంగతి ఏమిటి?’ అంటూ ప్రశ్నల వర్షం గుప్పించారు.

అయితే, జానారెడ్డి లేవనెత్తిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి గానీ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వివేది గానీ సూటిగా సమాధానం చెప్పలేదు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది విషయంలో న్యాయనిపుణుల సలహా తీసుకుంటామంటూ దాటవేశారు. రాజీవ్ యువకిరణాల్లో ఉద్యోగాలు కల్పించడం మంచిదే అయినా.. ఏ జిల్లాల్లో ఎంత మందికి ఉద్యోగాలు ఇస్తున్నారన్న విషయాన్ని మంత్రులకు, జిల్లాల ఎమ్మెల్యేలకు ఎందుకు చెప్పడం లేదని, ఇందులో మంత్రుల పాత్ర ఏమిటని ఈ సందర్భంగా శైలజానాధ్, ఏరాసు ప్రతాపరెడ్డి ప్రశ్నించారు.

పుస్తకాల్లో లెక్కలొద్దు.. వాస్తవం చెప్పండి..
ఇటు విద్యుత్ సరఫరా విషయంపైనా జానారెడ్డి ప్రభుత్వ తీరును నిలదీశారు. ‘రోజు ఇళ్లల్లో కరెంటు పది సార్లు వచ్చిపోతోంది. ఈ సమస్య తీవ్రంగా ఉంది. దీని నుంచి గట్టెక్కడానికి ఏం చేస్తున్నామో చెప్పాల్సిన అవసరం లేదా? సకల జనుల సమ్మెను ఇంకెంత కాలమని సాకుగా చూపిస్తాం. వాస్తవ పరిస్థితులను ఇక్కడైనా చెప్పండి’ అని మంత్రి ప్రశ్నించారు. రైతులకు కూడా ఏడుగంటల కరెంటు అందడం లేదన్నారు. దీనిపై ట్రాన్స్‌కో సీఎండీ ఏదో చెప్పడానికి ప్రయత్నించగా.. పుస్తకంలో ఉన్న లెక్కలు కాదు.. వాస్తవ పరిస్థితి వివరించండని జానా గద్దించారు. దీంతో సీఎం జోక్యం చేసుకున్నారు. వ్యవసాయానికి ఒకటి లేదా రెండు విడతల్లో ఏడు గంటల విద్యుత్ సరఫరా చేయాలని సూచించడానికే ఆయన పరిమితమయ్యారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి పేదలను ఇబ్బంది పెట్టామన్న అభిప్రాయం కలుగుతోందని, వారికి బిల్లులు మంజూరు చేయడం లేదని, రెండేళ్ల నుంచి ఎస్సీ, ఎస్టీల ఇళ్ల నిర్మాణం నిలిచిపోయిందని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా అసంతృప్తిని వ్యక్తం చేశారు. అదే సమయంలో విశాఖలో జాతీయ పట్టణ నవీకరణ పథకం కింద చేపట్టిన ఇళ్లు కూడా ఆగిపోయాయని మరో మంత్రి పసుపులేటి బాలరాజు ప్రస్తావించారు. దళిత, గిరిజనుల ఇళ్లే మధ్యలో ఆగిపోతున్నాయని మంత్రి విశ్వరూప్ ఆందోళన వ్యక్తం చేశారు.

తప్పుడు లెక్కలతో నిధులు దిగమింగుతున్నారు.
సెడారమ్ పేరుతో వికలాంగులకు పెన్షన్లు మంజూరు చేయకుండా తిప్పించుకుంటున్నారని, అసలు వారికి పెన్షన్లు ఇస్తారా? ఇవ్వరా? ఏదో ఒకటి చెప్పండంటూ దానం నాగేందర్ ప్రశ్నించారు. కంప్యూటర్ ఇచ్చే సర్టిఫికెట్ పెన్షన్‌కు పనికి వస్తుందేమో కానీ, ఉద్యోగాలకు అది పనికిరాదని డాక్టర్ల ప్యానెల్ విధిగా సర్టిఫై చేయాల్సిందేనని ఈ సందర్భంగా ఆరోగ్య శాఖ మంత్రి డీ ఎల్ రవీంద్రారెడ్డి చెప్పారు. సెడారమ్ అనేది శాస్త్రీయం కాదని ఆయనే స్పష్టం చేశారు. అలాగే.. హైదరాబాద్‌లో అర్హులైన వారికి రేషన్‌కార్డులు ఇవ్వడం లేదని దానం అసంతృప్తి వ్యక్తం చేశారు. అటు విద్యా శాఖ విషయంలో తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోందని మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థసారథి నిష్టూరమాడారు. మధ్యాహ్న భోజనంపై తప్పుడు లెక్కలు చూపించి నిధులు మింగుతున్నారని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

10 ఎకరాలకు ఒక బోరా.. ప్రయోజనముండదు
కరువు పరిస్థితుల్లో నిబంధనలు అంటూ కూర్చుంటే కుదరదని, కూలీలు వలసలు వెళ్తారని.. కూలీలకు వారున్న గ్రామాల్లోనే పనులు కల్పించాలని మంత్రి వట్టి వసంతకుమార్ చెప్పారు. పది, ఇరవై కిలోమీటర్ల దూరంలో పనులు కల్పిస్తామంటే ఎవరూ రారని, పనులు గుర్తించి వెంటనే వారికి కూలీ కల్పించాలని కలెక్టర్లకు సూచించారు. ఇందిర జలప్రభ కింద 10 ఎకరాలకు ఒక బోరు వేయడం వల్ల ప్రయోజనం ఉండదని, అవసరమైన చోట రెండు మూడు బోర్లు వేయాలని, అప్పుడే పథకం ఫలితాలు ఇస్తుందని మంత్రి జానారెడ్డి చెప్పారు.

కాగా, జిల్లా, మండల, పంచాయతీ నిధులపై ఉన్న ఆంక్షలు ఎత్తేయాలని కలెక్టర్లు ప్రభుత్వాన్ని కోరారు. ‘సీఆర్‌ఎఫ్(విపత్తు సహాయక నిధి) నిధులు కేవలం ట్యాంకర్లు, బోర్ల ఫ్లషింగ్‌కు మాత్రమే వినియోగించాల్సి వస్తోంది. అలా కాకుండా నాన్ సీఆర్‌ఎఫ్ నిధులు కూడా ఇవ్వాలి’ అని కోరారు. కడప, కర్నూలు సమ్మర్ స్టోరేజీ ట్యాంకులకు నీరు విడుదల చేయాలని, నాగార్జునసాగర్ కుడి, ఎడమ కాలువలకు నీరు విడుదల చేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లు కోరారు. తాగునీటి అవసరాల నిధులపై సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ ఈ సందర్భంగా సీఎం గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులను ఆదేశించారు.

మధ్యలోనే వెళ్లిపోయిన సీనియర్ మంత్రులు..
సంక్షేమ పథకాలు, ఆరోగ్యశ్రీ, 108, 104 అంశాలకు సంబంధించి కలెక్టర్ల సమావేశంలో చర్చ జరుగుతున్న సమయంలో సీనియర్ మంత్రులెవరూ లేకుండా పోయారు. మంత్రులు జానారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, వట్టి వసంతకుమార్, ముఖేష్, సబిత ఇంద్రారెడ్డి తదితరులు ముందే వెళ్లిపోయారు. ఇటు అధికారులు కూడా ఈ అంశాలపై పెద్దగా స్పందించలేదు. దీనిపై ఆరోగ్యశాఖ మంత్రి డీఎల్ కూడా నిర్వేదం వ్యక్తం చేశారు. జిల్లాల్లో 108, 104 వాహనాలు సరిగా తిరగకపోవడంపై కలెక్టర్లు ప్రశ్నిస్తే.. ఆయన వివరణ ఇవ్వాలని భావించినా.. ఎవరూ అడగలేదు.