Wednesday, December 14, 2011

Govt Neglect on 108,104/అంపశయ్యపై ప్రాణదాత

Govt Neglect on 108,104/అంపశయ్యపై ప్రాణదాత


దివంగత వైఎస్ మానసపుత్రికలైన 108, 104 పథకాలు పూర్తిగా నీరుగారిపోతున్నాయి. బడ్జెట్‌లో వేల కోట్లు పెట్టిన సర్కారుకు.. ఈ రెండు పథకాలకు కలిపి కేవలం రూ.200 కోట్లు ఇవ్వడానికి కూడా చేతులు రావడం లేదు. రోజూ లక్షలాది మంది రోగులు త ల్లడిల్లిపోతున్నా... మరికొందరు అభాగ్యులు అర్ధంతరంగా ప్రాణాలు విడుస్తున్నా మనసు కరగడం లేదు. ఇతర రాష్ట్రాలకు సైతం ఆదర్శంగా నిలిచి, అక్కడ చక్కగా నడుస్తున్న 108 పథకం... మన రాష్ట్రంలో మాత్రం నిర్వీర్యమైపోతోంది. 2009 వరకూ ఈ పథకం బాగానే నడిచింది. వైఎస్ మరణంతో కష్టకాలం మొదలైంది. పథకానికి ఇచ్చే నిధులకు రాష్ట్ర ప్రభుత్వం కోతలు వేయడం మొదలుపెట్టింది.
                               
సర్కారు నిర్లక్ష్యంతో పూర్తిగా నిర్వీర్యం
* డీజిల్‌కూ దిక్కులేక రోడ్డెక్కని అంబులెన్సులు
* సగానికి సగం పడకేసిన వాహనాలు
* అరణ్యరోదనగా మిగిలిపోతున్న 108 ఫోన్‌కాల్
* ఎక్కడికక్కడ నిలిచిపోయిన 104 సేవలు
* గ్రామాల దరిచేరని మందులు
* తల్లడిల్లుతున్న లక్షలాది మంది రోగులు

వైఎస్ ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, ఎన్‌ఆర్‌హెచ్‌ఎం (జాతీయ గ్రామీణ ఆరోగ్యమిషన్) కలిపి ఈ పథకానికి రూ.100 కోట్ల దాకా నిధులు వచ్చేవి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా ఎప్పుడూ రూ.70 కోట్ల నుంచి రూ.80 కోట్లకు తగ్గేది కాదు. ఇప్పుడా పరిస్థితి లేదు. ప్రభుత్వ వాటా కేవలం రూ.56 కోట్లకే పరిమితమైంది. ఆ నిధులైనా ఇస్తున్నారా అంటే అదీ లేదు. 2011 సెప్టెంబర్‌లో జీవీకేతో ప్రభుత్వం కొత్త అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. ఒక్కో వాహనానికి నెలకు రూ.95 వేల చొప్పున నెలకు రూ.7.14 కోట్లు ఇస్తామని చెప్పారు. మూన్నెల్లకోసారి అడ్వాన్సుగా నిధులివ్వాలి. కానీ అలా జరగట్లేదు. ఫలితం ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోతున్నాయి. రూ.12 కోట్ల బకాయి ఉందని జీవీకే సంస్థ చెబుతున్నా... ఇవ్వాల్సింది రూ.6 కోట్లే అంటూ సర్కారు వాదిస్తోంది. ఉద్యోగులకు కూడా సకాలంలో జీతాలు చెల్లించలేని పరిస్థితి నెలకొంది.

104కు నూటొక్క కష్టాలు..
రోజూవారీ 104 ఆరోగ్య సేవ (ఫిక్స్‌డ్ డే హెల్త్ సర్వీసెస్)ల్లో భాగంగా గ్రామీణ ప్రాంతాలకు ఉచిత మందులు అందకపోవడంతో పేద రోగులు తల్లడిల్లుతున్నారు. దీనికి సర్కారు నిధులివ్వడమే మానేసింది. వైఎస్ హయాంలో ఈ పథకానికి ఏడాదికి రూ.100 కోట్లు తక్కువ కాకుండా బడ్జెట్ కేటాయించేవారు. ఇప్పుడా బడ్జెట్ రూ.40 కోట్లకు కుదించేశారు. ఈ ఏడాది ఇప్పటివరకూ 104కు ప్రభుత్వం విడుదల చేసింది కేవలం రూ.10 కోట్లు. బకాయిలు కూడా పేరుకుపోతున్నాయి. దీంతో పథకానికి మందులు సేకరించే రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల సంస్థ చేతులెత్తేసింది. హెచ్‌ఎంఆర్‌ఐ చేతుల్లోనుంచి పథకం కలెక్టర్ల చేతుల్లోకి వెళ్లిన తర్వాత పరిస్థితి మరింత దిగజారింది. బడ్జెట్‌లో కేటాయించిన రూ.40 కోట్లు సరిపోవని, అదనంగా కనీసం రూ.20 కోట్లయినా ఇవ్వాలని అధికారులు సర్కారుకు ప్రతిపాదనలు పంపారు.

నాలుగు నెలలుగా నిధులు ఇవ్వకపోవడంతో పల్లెలకు మందులు వెళ్లడం లేదు. గర్భిణులు, చిన్నారులు, బాలిం తలతోపాటు రక్తపోటు, మధుమేహం, కీళ్లనొప్పులు, మూర్ఛ, గుండెజబ్బులు తదితర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు మందుల్లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రతినెలా ఈ మందులతో సుమారు 20 లక్షల మందికి లబ్ధి చేకూరేది. ఇప్పుడు వారంతా మందుల కోసం ఎదురుచూస్తున్నారు. ఇక 104 సిబ్బందికి జీతాలు రాకపోవడంతో వారు నెలరోజుల నుంచి సమ్మె చేస్తున్నారు. పథకం కింద పనిచేస్తున్న 3,500 మంది ఉద్యోగుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది.

ఉద్యోగుల జీవితాలతో చెడుగుడు...!
ఈ ఏడాది 1.16 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెబుతున్న సీఎం.. ఉన్న సిబ్బందిని ఎడాపెడా తొలగించేస్తున్నారు. 104 సర్వీసుల్లో ఎక్కువ మంది ఉద్యోగులున్నారం టూ సర్కారు కమిటీ వేసింది. ఈ కమిటీ ప్రస్తుతమున్న 3,500 మంది సిబ్బంది అవసరం లేదని, 2,200 మంది సరిపోతారని చెప్పింది. దీంతో 1,300 మంది సిబ్బంది ఇంటిదారి పట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఫోన్ ద్వారా వైద్య సలహాలిచ్చే 104 కాల్‌సెంటర్ సిబ్బందిపైనా సర్కారు వేటు వేసింది. 900 మంది ఉద్యోగులున్న కాల్‌సెంటర్‌ను మూసేశారు. 100 మందిని మాత్రమే ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కు తీసుకుంటామని చెప్పింది. మిగతా 800 మంది వీధిన పడ్డారు.

ఈ ఏడాది (2011-12) వైద్య, ఆరోగ్య శాఖ బడ్జెట్.. అక్షరాలా రూ.4,100 కోట్లు!
*మంగళవారం కేవలం డీజిల్ ఖర్చులకు డబ్బుల్లేక, మరమ్మతులకు నోచుకోక రాష్ట్రవ్యాప్తంగా ఆగిపోయిన 108 అంబులెన్సులు... 400!!
*ఆపత్కాలంలో 108 కోసం ఫోన్లు చేసిన వేలాది మంది ఆర్తనాదాలు అరణ్యరోదనగానే మిగిలిపోయాయి...
*104 పథకం పడకేయడంతో నెలకు సుమారు 20 లక్షల మంది రోగులు అల్లాడుతున్నారు!
*104 సిబ్బంది జీతాలకు దిక్కులేదు.. నెలరోజుల నుంచి సమ్మె చేస్తున్నా సర్కారులో చలనం లేదు!!

104 నిలిచిపోవడంతో ఇదీ పరిస్థితి..
*900 గ్రామాల్లో ఈ పథకం సేవలు నిలిచిపోతున్నాయి.
*మొత్తం 475 వాహనాలు నెలలో 28 రోజుల పాటు పనిచేసి 25,200 గ్రామాలకు మందులిచ్చేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు.
*గర్భిణులు, బాలింతలు, జబ్బుపడ్డ చిన్నారులకు మందుల్లేవు
*మధుమేహం, మూర్చవ్యాధి, టీబీ, గుండెజబ్బు తదితర రోగులు అష్టకష్టాలు పడుతున్నారు
*28 రోజుల పనిదినాలను 24 రోజులకు తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల సుమారు 4 వేల గ్రామాలకు మందులు ఆగిపోయే ప్రమాదం ఉంది.