యంగ్ టైగర్ ఎన్టీఆర్ వైఎస్ జగన్ కు దగ్గరవుతున్నారా? జగన్ పై ఎన్టీఆర్ ఎందుకు పాజిటివ్ గా ఉంటున్నాడు? టీడీపీకి ఎన్టీఆర్ దూరమైనట్టేనా?ఇప్పుడు ఈ విషయాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి ఎన్టీఆర్ కు చెందిన స్టూడియో ఎన్ లో జగన్ కు 'ప్రతికూలంగా' వార్తలు రాయవద్దని ఆ చానల్ సిబ్బందికి ఎన్టీఆర్ చెప్పారట. ఈ మద్య స్టూడియో ఎన్ సిబ్బందితో జరిగిన మీటింగ్ లో ప్రధానంగా జగన్ కు ఆయన పార్టీకి సంబంధించిన వార్తలు వ్యతిరేకంగా రాయవద్దని ఎన్టీఆర్ వారికి సూచించాడట. దీనిపై ఎన్టీఆర్ ఉద్దేశం ఏమై ఉండవచ్చనేది ఇప్పుడు హాట్ టాపిక్. చంద్రబాబుకు జూనియర్ ఝలక్ ఇవ్వబోతున్నట్టే పరిణామాలు కనిపిస్తున్నాయనేది లేటెస్ట్ టాక్.
ఎన్టీఆర్ మామ నార్నెశ్రీనివాసరావుకు చెందిన స్టూడియో కొద్ది రోజులు చంద్రబాబు తనయుడు లోకేష్ నడిపారు. కొద్ది రోజులకే తిరిగి ఆ చానల్ నార్నే వారికే వచ్చేసింది. అప్పటి నుంచి ఆ చానల్ రూటు మార్చుకుంది. అంతకు ముందు వరకు చంద్రబాబుకు అనుకూలంగా వార్తలు ప్రసారం చేసిన ఆ చానల్.. ఆ టైమ్ లో జగన్ పై వ్యతిరేక వార్తలు జోరుగానే ఇచ్చింది. ఐతే ఇప్పుడు వార్తల విషయంలో ఉన్నట్టుండి మారిపోయింది. చంద్రబాబుకు, టీడీపీకి ప్రతికూలంగా వార్తలు ప్రసారం చేస్తోంది. ఎన్టీఆర్..తమ చానల్ సిబ్బందికి జగన్ కు వ్యతిరేకంగా రాయవద్దని చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.
ఇంతకీ జగన్ కు వ్యతిరేకంగా వార్తలు రాయవద్దనే దాని వెనుక ఎన్టీఆర్ ఉద్దేశం ఏంటి? ఆ చానల్ లో టీడీపీకి ఎందుకు వ్యతిరేకంగా వార్తలు ఇస్తున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ బలం పెంచి టీడీపీని దెబ్బతీయాలనే వ్యూహం ఎన్టీఆర్ లో ఉందనే టాక్ కూడా వచ్చేసింది. ఇటీవల హరికృష్ణ కామెంట్లు కూడా చర్చనీయాంశం అయ్యాయి. 'టీడీపీ తమను వద్దనుకుంటే తప్ప'.. తమకు తాము వదిలిపెట్టబోమని ప్రకటించారు. తనతో పాటు ఎన్టీఆర్ టీడీపీలోనే కొనసాగుతామని హరికృష్ణ ప్రకటించాల్సి వచ్చిందంటే అసలు విషయం ఏంటో బయట పడుతూనే వుంది.
కొద్ది రోజుల క్రితమే హరికృష్ణ- చంద్రబాబుకు లేఖలు రాసి కలకలం సృష్టించారు. పార్టీలో జూనియర్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని హరికృష్ణ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఎన్టీఆర్ కూడా తన ఫ్యాన్స్‌కు పార్టీలో గౌరవం ఉండాలని కోరుకున్నా కుదరలేదు. దీంతో ఇద్దరూ పార్టీకి మెల్లగా దూరమవుతూ వస్తున్నారు. చంద్రబాబు..ఎన్టీఆర్ ను పార్టీకి దూరం పెట్టడం, హరికృష్ణకు పార్టీ వ్యవహారాల్లో అంతగా ఛాన్స్ ఇవ్వకపోవడం వంటి విషయాలు హరికృష్ణకు నచ్చడం లేదని అంటున్నారు.
ఇటీవల ఎన్టీఆర్ వర్థంతి రోజు నుంచి చంద్రబాబుకు నందమూరి కుటుంబ సభ్యులు దూరమవుతున్నపరిణామాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రతి వర్థంతికి ఎన్టీఆర్ ఘాటుకు కలిసి వెళ్ళి నివాళులు అర్పించే నారా-నందమూరి కుటుంబ సభ్యులు ఈసారి విడి విడిగా వెళ్లారు. ఇటీవలి పరిణామాలు గమనిస్తే కూడా చంద్రబాబుకు హరికృష్ణ, ఎన్టీఆర్ దూరమవుతున్నట్టే కనిపిస్తున్నాయి. నారా-నందమూరి ప్రచ్ఛన్నయుద్దం ఎంతవరకు వెళుతుందో కొద్ది రోజుల్లోనే తేలిపోనుంది.
source: http://telugu.bharatone.com/news/bharat1/4/1398