Sunday, November 6, 2011

వేల కోట్ల నిరుపేద!.. చంద్రబాబు

అబద్ధాల బాబు అడ్రస్ ఇదీ


వేల కోట్ల నిరుపేద!.. చంద్రబాబు



*భారీ భవంతిలో నివాసం... మూడు గదుల ఇల్లంటూ బీద అరుపులు
*రూ.583 కోట్ల విలువైన ఆస్తులకు బాబు కట్టిన విలువ కేవలం రూ.38 కోట్లు
*ఆ ఆస్తులకు వంద కోట్లిస్తామంటూ వైఎస్సార్ కాంగ్రెస్ బంపర్ ఆఫర్
*అలాకాదు.. వెయ్యి కోట్లిస్తే మొత్తం ఆస్తులు రాసిచ్చేస్తానని మాట మార్చిన బాబు
*‘మాట వరసకు అన్నారు తప్ప నిజంగా ఇచ్చేస్తారా’... అంటూ టీడీపీ వత్తాసు
*బినామీల పేరిట, విదేశాల్లో పెట్టిన ఆస్తుల్ని లెక్కేస్తే కొన్ని వేల కోట్లపైనే
*1979లో కేవలం మూడెకరాలతో మొదలైన బాబు మనీ యాత్ర
*తండ్రి ఆస్తి అరెకరం... తల్లి ఆస్తి రెండున్నర ఎకరాలు
*అన్నీ విస్మరించి హజారే వారసుడిగా ఉద్యమమట!.. నవ్విపోతున్న జనం...



హైదరాబాద్, సాక్షి ప్రతినిధి
‘‘నాకు 26 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉంది. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశా. అయినా డబ్బులేమీ కూడబెట్టుకోలేదు. నాకున్నది మూడు గదుల ఇల్లు. ఒక గది నాది. మరో గది నా కుమారుడిది. ఇంకో చిన్న గదిని అతిథులొచ్చినపుడు వాడుతూ ఉంటాం’’
- శుక్రవారం కర్నూలులో టీడీపీ అధినేత చంద్రబాబు

ఒకరోజేమో వెయ్యి కోట్ల రూపాయలిస్తే తన ఆస్తులు రాసిచ్చేస్తానంటూ సవాల్ విసురుతారు. అంతలోనే తన మొత్తం ఆస్తుల విలువ రూ.38 కోట్లేనంటూ అడక్కుండానే వివరాలు అందజేస్తారు. ‘‘సరే! మేం వంద కోట్లిస్తాం.ఆ 38 కోట్ల విలువైన ఆస్తులు రాసిచ్చేస్తారా!’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ బంపర్ ఆఫర్ ఇస్తే.. కాదనడానికి ఔననడానికి నోరు రాదు. అంతలోనే.. ఏదో మాటవరసకు అన్నారు గానీ నిజంగా ఇచ్చేస్తారా... అంటూ టీడీపీలోని బాబు వందిమాగధులు వత్తాసు పలుకుతారు. మరోరోజేమో తానుండేది మూడు గదుల ఇంట్లోనే...అని బాబు మరో బాంబు పేలుస్తారు.



చంద్రబాబు తన ఆస్తుల గురించి ఎందుకింత వర్రీ అవుతున్నారు? ఎందుకు రోజుకో రకంగా మాట్లాడాల్సి వస్తోంది? తన మాటల్ని ఎవ్వరూ నమ్మటం లేదనా? ఇలా చెప్పి జనాన్ని గందరగోళ పరచటమే ఆయన వ్యూహమా? జూబ్లీహిల్స్‌లో 1300 గజాల స్థలంలో నిర్మించిన భారీ సౌధంలో ఉంటూ... ఆ పక్కనే మరో సౌధాన్ని నిర్మించుకుంటూ కూడా ఇలాంటి మాటలేల..? జనం జ్ఞాపకశక్తిమీద బాబుకు మరీ అంత చులకన భావమెందుకు? దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.వర్ధంతినాడు... సందర్భమేమీ లేకపోయినా పనిగట్టుకుని మరీ తన ఆస్తుల వివరాలంటూ అంకెల గారడీ చేసిన చంద్రబాబును చూసి యావత్తు రాష్ట్రం నవ్విపోలేదా? 2009 ఎన్నికల అఫిడవిట్లో తన పేరిట, భార్య భువనేశ్వరి పేరిట మొత్తం రూ.70 కోట్ల ఆస్తులున్నట్లు ప్రకటించిన చంద్రబాబు... తన పేరిట, భార్య పేరిట, కుమారుడు లోకేష్ పేరిట, కోడలు బ్రహ్మణి పేరిట ఉన్న మొత్తం ఆస్తులు కేవలం రూ.38 కోట్లేనని 2011 సెప్టెంబర్ 2న చెప్పినపుడు టీడీపీ శ్రేణులు సైతం ముక్కున వేలేసుకోవటం నిజం కాదా? ఇది బాబు దివాలాకోరుతనానికి పరాకాష్ట కాక మరేమిటి?
                                                     


బాబు ఇంట్లోవాళ్లయినా నమ్ముతారా?
ఇరవై ఆరేళ్ల రాజకీయ జీవితంలో తానేమాత్రం సంపాదించుకోలేదని చంద్రబాబు నాయుడు చెబితే బహుశా! ఆయన ఇంట్లో వాళ్లు కూడా నమ్మరు!!. ఎందుకంటే 1979లో ఎమ్మెల్యే కాకముందు చంద్రబాబునాయుడి తండ్రి ఖర్జూర నాయుడికున్న ఆస్తి కేవలం 20 గుంటలు. అంటే అర ఎకరం. తల్లి అమ్మణ్ణమ్మకున్న ఆస్తి రెండున్నర ఎకరాలు. బాబు రాజకీయాల్లోకి ప్రవేశించి ఎనిమిదేళ్లు గడిచాక... 1988 నాటికి ఈ భూమి 77 ఎకరాలకు చేరిపోయింది.

పదేళ్లు గడిచేసరికి... అంటే 1994 నాటికి రూ.19 కోట్లకు చేరింది. అది అంతకంతకూ పెరుగుతూ 2004లో రూ.39 కోట్లకు.. 2009లో ఏకంగా రూ.51 కోట్లకు చేరిపోయింది. కాకపోతే ఇవన్నీ స్వయంగా చంద్రబాబు నాయుడు ప్రమాణపూర్వకంగా చెప్పిన అఫిడవిట్ లెక్కలు. వాటి వాస్తవ విలు వ చూసినా... బినామీల పేరిట బాబు పెట్టిన ఆస్తులు చూసినా కళ్ళు తిరిగి కింద పడ టం ఖాయం. ఎందుకంటే అవి కొన్ని వేల కోట్ల రూపాయల్ని దాటిపోయాయి కాబట్టి.

అసలు పారదర్శకత ఉందా?
నిత్యం పారదర్శకత మంత్రాన్ని వల్లెవేస్తూ... అన్నా హజారేకు వారసుడినంటూ... నానాటికీ మూడు గదుల ఇల్లని, నిరుపేదనని బీద అరుపులు అరుస్తున్న చంద్రబాబు నాయుడికి అసలు మనస్సాక్షి ఉన్నదా? అన్నదే అసలు ప్రశ్న. ముందస్తు వ్యూహం ప్రకారం హైటెక్ సిటీ తరహాలో పెద్ద పెద్ద ప్రాజెక్టులు ప్రకటించే ముందు అక్కడ తన కుటుంబీకుల పేరిట, బంధుమిత్రుల పేరిట, బినామీల పేరిట భారీగా భూములు కొనుగోళ్లు చేయటం... ఆ తరవాత ప్రాజెక్టును ప్రకటించటం... దానివల్ల పెరిగిన ధరల్ని సొమ్ము చేసుకోవటం... ఈ బాబు మార్కు వ్యూహం గురించి ఈ రాష్ట్రంలో తెలియనివారెవరైనా ఉన్నారా? అన్నదే అసలు ప్రశ్న.

బినామీల్ని పెంచి పోషించటం... వారికి రాజకీయ పదవులు కట్టబెట్టడం... ఆఖరికి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టును కూడా రాజకీయాలతో భ్రష్టు పట్టించేయటం... ఇవన్నీ ఇటీవల హైకోర్టులో వై.ఎస్. రాజశేఖర రెడ్డి సతీమణి విజయమ్మ తన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం ద్వారా వెలుగులోకి వచ్చిన అంశాలే. దానిపై కోర్టు స్పందించి సీబీఐ విచారణకు ఆదేశిస్తే తన బినామీలు బయటపడటంతో పాటు వాస్తవాలు వెలుగులోకి వచ్చి రాజకీయంగా సర్వ భ్రష్టం అయిపోతానన్న భయంతోనే బహుశా... చంద్రబాబునాయుడు ఇలాంటి బీద అరుపులు అరుస్తూ ఉండొచ్చు. కానీ ఆయన అక్రమాల గురించి ఏ కొంచెం సూచన ప్రాయంగా తెలిసిన వారు కూడా ఈ మాటల్ని నమ్మరన్నది అక్షర సత్యం.

తల్లి ద్వారా మనీ లాండరింగ్...!
ఇది మరీ చిత్రమే. ఎందుకంటే చంద్రబాబునాయుడి తల్లి అమ్మణ్ణమ్మకు పసుపు కుంకుమలుగా పుట్టింటి నుంచి వచ్చిన ఆస్తి కేవలం రెండున్నర ఎకరాలు. దానిపై వచ్చే ఆదాయం నిజానికి కుటుంబ పోషణకు కూడా సరిపోదు. అలాంటి అమ్మణ్ణమ్మ 2000వ సంవత్సరంలో ఏకంగా రూ.75 లక్షలు పెట్టి ఆస్తులు కొనుగోలు చేశారు. హైటెక్ సిటీకి కూతవేటు దూరంలో ఉండే మదీనాగూడలో రూ.40 లక్షలు పెట్టి ఐదెకరాల స్థలాన్ని... అతి ఖరీదైన బంజారాహిల్స్‌లో రూ.35 లక్షలు వెచ్చించి 1,135 చదరపు గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు.

అంతటితో ఊరుకున్నారా అంటే... లేదు. ఏడాది తిరక్కుండానే ఆ రెండు ఆస్తుల్నీ చంద్రబాబునాయుడి తనయుడైన లోకేష్‌కు ప్రేమతో బహుమతిగా ఇచ్చేశారు. పోనీ అమ్మణ్ణమ్మ తన సొంత సొమ్ముతో ఆ ఆస్తుల్ని కొన్నారనే అనుకుందాం. ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్న అమ్మణ్ణమ్మ వారందరినీ వదిలిపెట్టి చంద్రబాబునాయుడి తనయుడికే ఆ ఆస్తుల్ని బహుమతిగా ఎందుకు ఇచ్చేసినట్లు? అది చంద్రబాబు సొమ్ముతో కొన్నవేననటానికి ఇంతకన్నా ఆధారాలు కావాలా?
 


ఈ రెండు లావాదేవీలు.. బినామీల ‘మచ్చు’తునకలు...
మదీనాగూడలో అమ్మణ్ణమ్మ ఐదెకరాలను కొనుగోలు చేసి తన మనవడు లోకేష్‌కు బహుమతిగా ఇచ్చారు. అయితే ఆమె ఆ భూమిని కొన్నది ఎవరినుంచో కాదు. బాబు సహచరుడిగా, బినామీగా, బాబు కంపెనీల్లో డెరైక్టర్‌గా వ్యవహరించిన వడ్లమూడి నాగరాజానాయుడి బంధువుల దగ్గర్నుంచి. ఈ వ్యవహారం అక్కడితో ఆగిపోలేదు. ఆ ఐదెకరాలను ఆనుకుని ఉన్న మరో ఐదెకరాలను తన బంధువుల నుంచే నాగరాజా నాయుడి భార్య సుధాశారద కొనుగోలు చేశారు.
 

తరవాత ఆమె దాన్ని చంద్రబాబు నాయుడి భార్య భువనేశ్వరికి విక్రయించేశారు. ఆ రకంగా అత్యంత విలువైన మదీనా గూడలో పదెకరాల స్థలం అధికారికంగా చంద్రబాబునాయుడి చేతికి వచ్చేసింది. ఇపుడు దాని విలువ ఎంత లేదన్నా రూ.200 కోట్ల పైమాటే. ఇంకా చిత్రమేమిటంటే స్థానికులు చెబుతున్న ప్రకారం ఇక్కడ బాబు నిర్మించిన కాంపౌండ్‌లో పదెకరాలకన్నా ఎక్కువ స్థలమే ఉందని!?. ఈ సర్వేలోని మొత్తం 19 ఎకరాల భూమి అనధికారికంగా బాబు చేతుల్లోనే ఉందన్నది స్థానికులు చెబుతున్న మాట.

మరో లావాదేవీ చూస్తే... అమ్మణ్ణమ్మ రూ.35 లక్షలు పెట్టి బంజారాహిల్స్‌లో కొన్న స్థలాన్ని ఏడాది తిరక్కుండానే లోకేష్‌కు బహుమతిగా ఇచ్చేశారు. తరవాత లోకేష్ దాన్ని జాస్తి సత్యనారాయణకు విక్రయించారు. ఆయనెవరో తెలుసా...? నాగరాజా నాయుడి మామ. మరో ఏడాది తిరక్కుండానే ఆయన ఆ ఆస్తిని తన కుమార్తె, నాగరాజా నాయుడి భార్య అయిన సుధాశారదకు బహుమతిగా ఇచ్చేశారు. ఇక్కడ ఒకటే ప్రశ్న. తన బినామీల చేతికి రప్పించడానికి కాకపోతే ఒక ఆస్తిపై ఇన్ని రకాల లావాదేవీలెందుకు?

ఎన్టీఆర్ ట్రస్టు బాబు ఆస్తి కాదా!
చంద్రబాబు ఎప్పుడు ఆస్తులు ప్రకటించినా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు ఆస్తుల ఊసే రాదు. ఎందుకంటే అది ట్రస్టు కాబట్టి. కానీ బంజారాహిల్స్‌లో భారీ భవంతితో పాటు కోట్ల రూపాయల ఆస్తులున్నది ట్రస్టు పేరిటే. ఈ ట్రస్టుకు చంద్రబాబు శాశ్వత ట్రస్టీ కాగా... ఆయన భార్య భువనేశ్వరి, వారి కుటుంబ ఆడిటర్ దేవినేని సీతారామయ్య మిగిలిన ట్రస్టీలు. దీని పేరిట బంజారాహిల్స్‌లో ఉన్న భారీ భవంతిలో తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలు సాగిస్తున్నందుకు ఏటా అధికారికంగా ఆ పార్టీ కొంత రుసుము కూడా చెల్లిస్తోంది. తాను ముఖ్యమంత్రిగా ఉన్నపుడు తన ట్రస్టుకు తనే భూమిని కేటాయించుకుని, తనే సెట్లర్‌గా, తనే ట్రస్టీగా రాసుకుని చంద్రబాబునాయుడు స్వయంగా ఏర్పాటు చేసుకున్న ట్రస్ట్ ఇది. దీన్లోని మిగిలిన ట్రస్టీలను మెల్లగా సాగనంపటం ద్వారా చివరికి తన కుటుంబం అధీనంలోకి తెచ్చుకోగలిగారు. మరి దీన్ని బాబు ఆస్తిగా ఎందుకు పరిగణించకూడదు?

లోకేష్ ఆస్తుల్ని లెక్కకట్టగలరా!
చంద్రబాబు తనయుడు లోకేష్... అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్, కార్నెగీ మిలన్ యూనివర్సిటీల్లో చదవటం మినహా ఇప్పటిదాకా పెద్దగా చేసిన ఉద్యోగాలేవీ లేవు. అసలు ఇంటర్మీడియెట్ అత్తెసరు మార్కులతో పాసైన లోకేష్‌కు ఆ వర్సిటీల్లో సీట్లు రావటానికే భారీగా కోట్ల రూపాయల మేర డొనేషన్లు అవసరమయ్యాయని, వాటిని సత్యం కంప్యూటర్స్ అధినేత రామలింగరాజు అప్పట్లో సర్దుబాటు చేశారనేది ఇప్పటికీ వినవచ్చే ఆరోపణ. అంత ఖర్చుపెట్టడం తప్పితే ఆయన సంపాదించిన దాఖలాలైతే పెద్దగా లేవు. అంతోఇంతో పెద్ద ఉద్యోగమంటే ఆయన చేసింది, చేస్తున్నది హెరిటేజ్ ఫుడ్స్‌లోనే. కానీ నాయినమ్మ ఇచ్చిన గిఫ్ట్‌ల ద్వారా భారీ ఆస్తుల్ని కూడబెట్టిన లోకేష్... 2006-07 సంవత్సరాల్లో ముంబై శివార్లలో 8.42 ఎకరాలు, బెంగళూరు సమీపంలో 3.17 ఎకరాలు కొనుగోలు చేయటం విశేషం. అంతేకాక తన కుటుంబానికి చెందిన 15 కంపెనీల్లో డెరైక్టర్‌గా కొనసాగుతుండటంతో పాటు ఆయా కంపెనీల్లో భారీ షేర్లను కూడా సొంతం చేసుకున్నారు. ఈయన ఒక్కడి ఆస్తే దాదాపు రూ.300 కోట్లకు పైగా ఉంటుందన్నది మార్కెట్ విలువల్ని బట్టి చూస్తే ఏ ఒక్కరికైనా తేలిగ్గా అర్థమవకమానదు.

హెరిటేజ్ ఫుడ్స్ విలువే రూ. రెండు వందల కోట్లు!
హెరిటేజ్ ఫుడ్స్ కథ కూడా ఇంతే. చంద్రబాబు నాయుడితో పాటు నటుడు మోహన్‌బాబు కుటుంబీకులు, బోళ్ల బుల్లిరామయ్య, మరికొంతమంది కలిసి ఏర్పాటు చేసిన ఈ సంస్థలో ఇపుడు చంద్రబాబు, ఆయన కుటుంబీకులు తప్ప మిగిలిన వాళ్లెవ్వరూ లేరు. వ్యవస్థాపకుల్ని, మెజారిటీ షేర్ హోల్డర్లను వివిధ మార్గాల్లో బయటకు పంపి మొత్తం కంపెనీని తన గుప్పిట్లోకి తెచ్చుకున్న చంద్రబాబు... చివరకు తన కుమారుడిని దానికి ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ని చేశారు. తాజా లెక్కల ప్రకారం... (శుక్రవారం నాటికి) ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ.209 కోట్లు. మరి చంద్రబాబు తన ఆస్తి 38 కోట్లేనంటే నమ్మేవారెవరైనా ఉంటారా? నవ్విపోదురు గాక నాకేటి తరహాలో ఆయన తనకు మూడు గదుల ఇల్లే ఉందని, 26 ఏళ్లుగా ఏమాత్రం సంపాదించుకోలేదని, ముఖ్యమంత్రిగా ఉన్నా పైసా మిగుల్చుకున్న పాపాన పోలేదని చెబుతూ ఉంటే జనం నవ్విపోరా!? బాబుకు జనమంటే ఎందుకంత అలుసు?