Rayachoti MLA Srikanth Reddy |
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డిపై ఎల్లోమీడియా విషం కక్కుతోందని ఆ పార్టీ నేత, రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు ఆయన విలేకరులతో మాట్టాడారు. జగన్మోహన రెడ్డిని అరెస్టు చేస్తారని ఎల్లో మీడియా పదేపదే రాయడం చూస్తే, ఈ అసత్య ప్రచారం వెనుక ఏదో కుట్ర దాగి ఉందని స్పష్టంగా అర్ధమవుతోందన్నారు. జగన్ ని దెబ్బతీయడానికి కాంగ్రెస్, టిడిపి ఉమ్మడిగా కుట్ర పన్నాయని ఆయన ఆరోపించారు.
ఓబులాపురం మైనింగ్ కేసులో జగన్మోహన రెడ్డి ఒక సాక్షిగా మాత్రమే సిబిఐ ముందు హాజరయ్యారని తెలిపారు. విచారణ తరువాత బయటకు వచ్చిన జగన్మోహన రెడ్డి చంద్రబాబు హయాంలోనే 2002లో ఆ గనులు లీజుకు ఇచ్చినట్లు జిఓని చూపారన్నారు. అయితే అప్పటికి గాలి జనార్ధన రెడ్డి ఆ సంస్థలో లేరని సిబిఐ అధికారి లక్ష్మీనారాయణ చెప్పినట్లు కొన్ని పత్రికలలో వచ్చిందన్నారు. ఈ విషయంలో చంద్రబాబు నాయుడుకి ఏం సంబంధంలేదని అర్ధం వచ్చినట్లుగా ఆయన మాట్లాడారన్నారు. అంతే కాకుండా కొండారెడ్డి అనే వ్యక్తి పేరు పెట్టి ఎల్లో మీడియా విషం కక్కుతూ తప్పుడు కథనాలను రాసిందని చెప్పారు. ఇదంతా చూస్తుంటే లోపల జరిగిన విషయాలను సిబిఐ లీక్ చేస్తుందా అన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. సిబిఐ కార్యాలయం లోపలి విషయాలు ఎల్లో మీడియాకు ఎలా తెలుస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. జగన్ ఇంటి విషయంలో కూడా ఎల్లో మీడియా అసత్య ప్రచారం చేస్తోందన్నారు. ఈ విషయాలలో సిబిఐ వెంటనే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.