హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు భయపడుతున్నారని ఆ పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర రావు అన్నారు. పార్టీ కార్యాలయంలో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలు ఎప్పడు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ విషయం చంద్రబాబు నాయుడుకు కూడా తెలుసన్నారు. ఆ భయమే ఆయనని వెంటాడుతోందని చెప్పారు. చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఒకే మాట మాట్లాడుతున్నరన్నారు. విశ్వాసం నిరూపించుకోమని కోరితే, ఈ ప్రభుత్వం పరీక్షకు నిలబడలేదన్నారు. ప్రజలు ప్రభుత్వపై విశ్వాసాన్ని కోల్పోయారని చెప్పారు. ప్రతిపక్ష పార్టీగా టిడిపికి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే ప్రజాస్వామిక హక్కు ఉన్నా ఉపయోగించుకోవడంలేదన్నారు. ప్రతిపక్షం బాధ్యతగా వ్యవహరించడంలేదని విమర్శించారు. జగన్మోహన రెడ్డి ప్రజలలో ఉన్నందున, తను కూడా యాత్రలు మొదలుపెట్టారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు రైతు వేషం చూసి ప్రజలు పగటివేషగాడిని గుర్తు తెచ్చుకుంటున్నారన్నారు.
నిన్న ప్రకాశం జిల్లాలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రెండున్నర సంవత్సరాల తరువాత వచ్చే ఎన్నికలలో ఎవరికైనా ఓటు వేయవచ్చు అని చెప్పడంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని బతికించదలుచుకున్నట్లు స్పష్టంగా అర్ధమవుతోందన్నారు. ఇది ప్రజాస్వామ్య సాంప్రదాయం కాదన్నారు. కాంగ్రెస్, టిడిపి కుమ్మక్కయ్యాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట నిజమైందన్నారు. దాదాపు వంద మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే రెండున్నరేళ్లు ప్రభుత్వం ఉంటుందని ఎలా చెబుతున్నారని ఆయన చంద్రబాబుని ప్రశ్నించారు.
కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎందుకు కాపాడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందన్న భయం బాబుకు ఉందని స్పష్టంగా అర్ధమవుతోందన్నారు. వచ్చే శాసనసభ సమావేశాలలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతారా? లేదా? అని చంద్రబాబుని ప్రశ్నించారు. వచ్చే సమావేశాలలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భయపడుతున్నట్లు అర్ధం చేసుకోవలసి ఉంటుందన్నారు. ఎన్నికలు వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలుస్తుందని అనుకోవడంలేదా? అని బాబుని జూపూడి ప్రశ్నించారు.