గనుల శాఖ మాజీ సంచాలకులు వీడీ రాజగోపాల్ స్పష్టీకరణ
హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్ జగన్ ఏనాడూ తనకు ఫోన్ చేయలేదని, గనుల లీజుల విషయమై ఎప్పుడూ తమ శాఖపై ఒత్తిడి చేయలేదని భూగర్భ గనుల శాఖ మాజీ సంచాలకులు వీడీ రాజగోపాల్ స్పష్టం చేశారు. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న రాజగోపాల్ మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ‘‘అప్పటి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఓఎంసీకి ప్రాధాన్యం ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.
అసెంబ్లీలో ఏదైనా అంశం చర్చకు వచ్చినప్పుడు సాధారణంగా సంబంధిత మంత్రి సమాధానం ఇస్తారు. ఓఎంసీపై చర్చ సందర్భంగా అప్పటి సీఎం కలుగజేసుకుని మాట్లాడినట్లు అసెంబ్లీ రికార్డుల్లోనే ఉంది. కడపలో బ్రహ్మణి ఉక్కు కర్మాగారాన్ని నిర్మించేందుకు ఆ సంస్థ ముందుకు రావడం అందుకు కారణం కావచ్చు. వైఎస్ నన్ను, అప్పటి పరిశ్రమల శాఖ కార్యదర్శి శ్రీలక్ష్మిని పిలిచి ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ దరఖాస్తు చేసిన 25 హెక్టార్ల గనికి సంబంధించిన లీజును ఓఎంసీకి ఇవ్వాలని సూచించగా.. ఇది నిబంధనలకు వ్యతిరేకమని మేం చెప్పాం. దాంతో ఆయన మనసు మార్చుకున్నారు’’ అని రాజగోపాల్ చెప్పారు. గనుల వ్యాపారి శశికుమార్ చేసిన ఆరోపణలను ఖండించారు. ఓబుళాపురం గనుల కోసం అందరూ 2004 ఆగస్టులో దరఖాస్తు చేసుకుంటే శశికుమార్ 2005 మేలో దరఖాస్తు చేశారని తెలిపారు. ఆయన హైకోర్టులో పిటిషన్ వేసినా కోర్టు స్టే ఇవ్వకపోవడాన్ని గుర్తు చేశారు. సీబీఐ చేస్తున్న విచారణకు పూర్తిగా సహకరిస్తానని చెప్పారు.