మనసులేని పాలకవర్గం చేతిలో రాష్ట్రం ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్ విమర్శించారు. గుంటూరు జిల్లా ఓదార్పుయాత్రలో భాగంగా గురువారం రాత్రి ఆయన సత్తెనపల్లి మండలం కొమెరపూడి చేరుకున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన దివంగత మహానేత వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత జగన్ అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించారు.
కల్తీసారా బాధితులను చూస్తే బాధేస్తోందని అన్నారు. లిక్కర్ అమ్మకాలు నెలనెలా 15 శాతం పెంచుకోవడానికి ప్రభుత్వం తాపత్రయపడుతోందని దుయ్యబట్టారు. సరసమైన ధరలకు మద్యాన్ని అందించాలనేది ప్రతిపక్ష నేత చంద్రబాబు కోరికని ఎద్దేవా చేశారు. గ్రామాల నుంచి బ్రాందీ, సారాలను తరిమి కొడతామన్నారు. గ్రామాలు బాగుపడాలంటే అందరూ ఉన్నత చదువులు చదవాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతులను గాలికి వదిలేసిందని విమర్శించారు. కాంగ్రెస్ నైతిక విలువలకు తిలోదకాలిచ్చిందన్నారు. అధికారాన్ని అందించిన వైఎస్సార్‌ను కాంగ్రెస్ అప్రదిష్టపాలు చేస్తోందన్నారు. త్వరలో సువర్ణయుగం రాబోతోందని అన్నారు. ప్రజలు చూపుతున్న ఆప్యాయతను మరువలేని, ఎన్ని జన్మలెత్తినా వారి రుణం తీర్చుకోలేనని జగన్ అన్నారు.