Sunday, October 30, 2011

'మురుగైన 'సమాజం కోసమేనా?

'మురుగైన 'సమాజం కోసమేనా?





మెరుగైన సమాజం కోసమే ఉన్నానంటూ గొప్పలు పోతున్న టీవీ 9 చానల్ వ్యవహార శైలి.. నీతులున్నది చెప్పడానికి మాత్రమేనన్న సామెతను అడుగడుగునా గుర్తుకు తెస్తోంది! వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సాక్షి టీవీ చేసిన ఆరోపణలూ సవాళ్లలో ఒక్కదానికి కూడా నేరుగా స్పందించకుండా శనివారం ఆ చానల్ ఇచ్చిన డొంకతిరుగుడు వివరణే ఇందుకు తిరుగులేని నిదర్శనం! ఇతరుల బురద తమకంటదంటూ బడాయి పోతున్న ఆ చానల్ పుట్టుకే నిజానికి బురదమయం!! టీవీ 9 పునాది సత్యం కంప్యూటర్స్ నుంచి రాబట్టిన అక్రమార్జనతోనే ముడిపడింది. దాని పుట్టుకకు మూలాలున్నదే అక్కడ...!



టీవీ 9 అధినేత చింతలపాటి శ్రీనివాసరాజు ఉరఫ్ శ్రీనిరాజు సత్యం రామలింగరాజుతో కుమ్మక్కై రూ.2,400 కోట్లను సత్యం నుంచి అప్పనంగా కొట్టేశారు. రూ.1,500 విలువ చేసే సత్యం షేర్లను ఒక్కోటీ రూ.10 చొప్పున తొలుత 8 లక్షల షేర్లను తొలుత ఆయన కారుచౌకగా కొట్టేశారు. తర్వాత తాను ఎండీగా ఉన్న సత్యం ఎంటర్‌ప్రైజెస్ సొల్యూషన్స్ అనే సంస్థను సత్యం కంప్యూటర్స్‌లో విలీనం చేయడం ద్వారా మరో 8 లక్షల వాటాలను ఒక్కోటి రూ.10 చొప్పున రాబట్టుకున్నారు. ఇది అక్రమమన్న సత్యం వాటాదారుల గగ్గోలు అరణ్యరోదనే అయింది. ఈ రెండు లావాదేవీల ద్వారా శ్రీని రాజుకు రూ.2,400 కోట్లు వచ్చిపడ్డాయి.

ఈ దెబ్బతోనే సత్యం ఆర్థిక పునాదులు కదలడం మొదలైంది. చివరికది ఆ సంస్థ పతనానికే దారి తీసింది. ఇలా సత్యం ఉసురు తీసి రాబట్టుకున్న రూ.2,400 కోట్లను చింతలపాటి హోల్డింగ్స్ ద్వారా శ్రీనిరాజు మార్కెట్లో పెట్టారు. టీవీ 9 చానల్‌ను నిర్వహించే అసోసియేటెడ్ బ్రాడ్‌కాస్టింగ్ (ఏబీసీఎల్) సంస్థలో 90 శాతం వాటా ఈ చింతలపాటి హోల్డింగ్స్‌దే! 2003లో ఏబీసీఎల్‌ను ఏర్పాటు చేసిన ఐల్యాబ్స్ సంస్థ కూడా శ్రీనిరాజుదే. పైగా ఐల్యాబ్స్‌ను ప్రమోట్ చేసిందీ చింతలపాటి హోల్డింగ్సే! టీవీ 9లోకి ప్రవహించిన నిధులు సత్యం కంప్యూటర్స్‌వే అనేందుకు ఇంతకంటే రుజువు ఇంకేం కావాలి?!

ఈ వాస్తవాల జోలికి పొరపాటున కూడా వెళ్లకుండా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సాక్షి టీవీ సవాళ్లకు అసలే స్పందించకుండా టీవీ 9 ఇచ్చుకున్న వివరణ ఎవరి కళ్లకు గంతలు కట్టేందుకు? పైగా, తనకు ఏ సెజ్‌తోనూ సంబంధం లేదని దబాయిస్తున్న శ్రీనిరాజు.. నెల్లూరు-చిత్తూరు జిల్లాల సరిహద్దుల్లో ఏర్పాటైన శ్రీ సిటీ సెజ్‌పై ఏమంటారు? అందులో తనకసలు వాటాయే లేదని ఆయన చెప్పగలరా? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై టీవీ 9, ఇతర ఎల్లో మీడియా సిండికేట్ చేస్తున్న ఆరోపణలనే ప్రమాణంగా తీసుకుంటే... ఆ సెజ్‌ను పొందేందుకు ఆయన ఏ మేరకు ముడుపులు చెల్లించుకుని ఉంటారనుకోవాలి?!
source:
http://www.sakshitv.com/index.php?option=com_content&view=article&id=14667:2011-10-23-08-34-01&catid=109:2010-11-23-18-17-06&Itemid=757